Dragon ’gambling Online gaming based inward China .. targeting Indian youth #INDIANNEWS #TODAYNEWS
Subscribe to my channel for more info….
#China #Indianpeople #Target #BigScam
డ్రాగన్’ గ్యాంబ్లింగ్
చైనా కేంద్రంగా ఆన్‌లైన్ గేమింగ్.. భారతదేశ యువతపై గురి
‘కలర్ ప్రెడిక్షన్ గేమ్’ పేరుతో ఉచ్చు
టెలిగ్రామ్ గ్రూపుల్లో వెబ్‌సైట్ల వివరాలు
రోజుకో వెబ్‌సైట్ మారుస్తున్న చైనా సంస్థలు
గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి
ఒకరిద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు గుర్తింపు
2 ఖాతాల్లో రూ. 1100 కోట్ల లావాదేవీలు
30 కోట్లు ఫ్రీజ్.. ఢిల్లీలో నలుగురికి బేడీలు
అరెస్టయిన వారిలో చైనా జాతీయుడు
రెండు కంపెనీలతోనే ఇంతలా మోసాలు
మరో 28 కంపెనీలు ఉన్నాయి.. సీపీ వెల్లడి
హైదరాబాద్ సిటీ. భారతదేశ యువతపై గురిపెట్టి.. వారిని ఆన్‌లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ల ఉచ్చులో బిగించి.. వారి వద్ద ఉన్న డబ్బును కొల్లగొట్టి తమ దేశానికి తరలించాలని చైనా కంపెనీలు పథకం పన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా.. ‘కలర్ ప్రెడిక్షన్’ పేరుతో వల విసిరాయి. అమాయకులను నిలువుదోపిడీ చేయడం ప్రారంభించాయి. ఎంతలా అంటే.. ఓ రెండు కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఈ ఏడాది ఏకంగా రూ. 1,100 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. అలాంటివి లెక్కకుమిక్కిలి కంపెనీలున్నాయి. ‘డ్రాగన్’ కంపెనీల భారీ వ్యూహాన్ని హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించారు. ఒక చైనా దేశీయుడితో సహా.. ముగ్గురు వ్యక్తులను ఢిల్లీలో అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఈ తరహా కంపెనీల మూలాలకు వెళ్లి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. ‘‘నగరానికి చెందిన ఇద్దరు బాధితులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) సైబర్‌క్రైమ్ పోలీసులకు ఆన్‌లైన్ గేమింగ్ మోసాలపై ఫిర్యాదు చేశారు.
సికింద్రాబాద్‌కు చెందిన ఓ బాధితుడు జూలై 27న రూ. 97 వేలు పోగొట్టుకున్నాడు. మంగళవారం ఇలాంటిదే మరో ఫిర్యాదు వచ్చింది. కంచన్‌బాగ్‌కు చెందినమరో బాధితుడు రెండు రోజుల వ్యవధిలో ఆన్‌లైన్ గేమింగ్‌లో రూ. 1.64 లక్షలు నష్టపోయాడు’’ అని అంజనీకుమార్ వివరించారు. తెలంగాణ గేమింగ్ చట్టం, భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి.. బాధితులు డబ్బును బదిలీ చేసిన ఖాతాలపై దృష్టిసారించారని తెలిపారు. ఈ గేమింగ్ వ్యవహారమంతా సోషల్ మీడియాలో ప్రారంభమై.. అక్కడి నుంచి టెలిగ్రామ్‌లోకి.. ఆ తర్వాత ఒక్కరోజు మాత్రమే పనిచేసే గేమింగ్ సైట్లకు మారుతుందని పేర్కొన్నారు. ‘‘తొలుత కొందరు దళారులు అమాయకులను సోషల్‌మీడియాలో గుర్తిస్తారు. వారికి ‘కలర్ ప్రిడిక్షన్’లో చెప్పే రంగుతో డబ్బులేడబ్బులని నమ్మబలుకుతారు. ఆ తర్వాత టెలిగ్రామ్ చానల్ లింకును పంపుతారు. అలా చానల్‌లో సభ్యులను చేర్చే దళారులకు ఆయా చానల్‌ల అడ్మిన్ల నుంచి కమీషన్ దక్కుతుంది. చానల్ అడ్మిన్లు రోజువారీగా కలర్ ప్రిడిక్షన్ వెబ్‌సైట్ల వివరాలను గ్రూపులో పెడతారు. యూజర్లు ఆ లింకును అనుసరించి ఆన్‌లైన్ గేమింగ్ ఆడాల్సి ఉంటుంది. గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లను చానల్ అడ్మిన్లు సూచిస్తుంటారు. ఆయా వెబ్‌సైట్లు ఒక్కరోజే లైవ్‌లో ఉంటాయి’’ అని వివరించారు.
చైనా కేంద్రంగా..
ఈ తరహా గేమింగ్ వెబ్‌సైట్ల నిర్వాహకులు, భాగస్వాములు, డైరెక్టర్లు చైనాలోనే ఉన్నారని అంజనీకుమార్ తెలిపారు. ‘‘ఇప్పటి వరకు మా దర్యాప్తులో ఇలాంటి కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నట్లు గుర్తించాం. ఈ వెబ్‌సైట్ల సర్వర్లన్నీ చైనాలో, చైనా నుంచి నియంత్రించేలా క్లౌడ్ సర్వర్లు అమెరికాలో ఉన్నాయి. లింక్‌యున్, డోకీపే, స్పాట్‌పేకు చెందిన పేమెంట్ గేట్‌వేలను డబ్బు వసూలుకు వినియోగిస్తున్నారు. వాటికి పేటీయం, క్యాష్‌ఫ్రీ యాప్‌ల ద్వారా వినియోగదారులు డబ్బు పంపేలా వెసులుబాటు కల్పించారు’’ అని వెల్లడించారు. ఈ గేమ్‌లలో తొలుత యూజర్లు ఏ కలర్లు, నంబర్లు చెప్పినా వారు విన్ అయ్యేలా ప్రోగ్రామ్ ఉంటుందని, ఆ తర్వాత వారి ఖాతాలను కొల్లగొట్టేస్తారని తెలిపారు.
నలుగురి అరెస్టు..
నగరానికి చెందిన రెండు కేసులకు సంబంధించిన కంపెనీల అధికారులను అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. ‘‘ఈ కంపెనీల్లో భారతీయులు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. వీరంతా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నారు. నిందితుల జాడను గుర్తించగానే.. ప్రత్యేక బృందాలను పంపి వారిని అరెస్టు చేయించాం. అరెస్టయిన వారిలో చైనా జాతీయుడు యహ్‌హౌ, గురుగ్రామ్, ఢిల్లీకి చెందిన డైరెక్టర్లు అంకిత్‌కపూర్, నీరజ్ తులి, ధీరజ్ సర్కార్ ఉన్నారు. వారికి సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాల్లో ఈ ఏడాది రూ. 1,100 కోట్ల మేర లావాదేవీలు జరగ్గా.. ఓ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 30 కోట్లను ఫ్రీజ్ చేశాం. ఆన్‌లైన్ గేమింగ్ ఉచ్చులో చిక్కి కొందరు బాధితులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నట్లు గుర్తించాం. ఇటీవల చెన్నైలో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి’’ అని తెలిపారు. నిందితులంతా కరీబియన్ దీవుల్లోని కేమన్ ఐలాండ్‌లో కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహా గేమింగ్ బాధితులు 28 ఆయా రాష్ట్రాల్లో ఫిర్యాదులు చేశారని వెల్లడించారు.
రంగంలోకి ఈడీ, ఐటీ?
ఇటీవలే ఢిల్లీలో చైనా జాతీయులు రూ. 1,000 కోట్ల మేర హవాలా, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి, దాడులు చేసిన ఆదాయపన్ను (ఐటీ) శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు.. హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఆన్‌లైన్ గేమింగ్ నిందితులపై దృష్టిసారించినట్లు తెలిసింది. వారికి ఇప్పటికే సమాచారం అందించామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో జరిగిన రూ. 1,100 కోట్ల లావాదేవీల్లో.. రూ. 130 కోట్లను వేర్వేరు దేశాలకు పంపారని, మిగతా మొత్తాన్ని హవాలా మార్గాల్లో తరలించి ఉంటారని అనుమానిస్తున్నారు.